జీవ నది

                                                ఆధ్యాత్మిక సందేశములు

Telugu Christian Congregation - Kuwait

The River of Life

 Spiritual messages

Thursday

17 March 2005

No.9

 

విశ్వాసము

Bro.T.Everwell

                                (This page can be viewed in Telugu  in Windows XP only )

              ప్రియమైన వారలారా, మనం అనేక సార్లు విశ్వాసము అనే పదాన్ని వింటూ ఉంటాము. దేవునిని నమ్మడమే విశ్వాసము అని చాలా మందికి తెలుసు. కానీ ఆ విశ్వాసము ఎందుకు అవసరమో అది ఏమిటో  కొంతమంది గ్రహించరు. కనుక విశ్వాసము అంటే అది ఒక మతపరమైన మాట అని, ఈ నవీనయుగంలో అది పాత కాలపు మాట అని కొట్టి పారవేస్తుంటారు.

               నా స్నేహితుడు ఒకాయనకు ఎన్నో సంవత్సరాలనుంచి దేవునిని గూర్చి తెలుపుతూ, వివరిస్తూ వచ్చాను. అయితే ఆయన దేవునిని నమ్మేవాడు కాదు. అప్పుడు " నీవు ఎందుకు దేవునిని విశ్వసించడంలేదు?" అని అడిగాను. ఆయన " నేను దేవునిని గూర్చి పూర్తిగా తెలుసుకొనేవరకు ఆయనను విశ్వసించను" అని చెప్పాడు.  అప్పుడు నేను, " దేవుని గురించిన విషయాలు అనంతమైనవి, ఎంత అనంతమైనవి అంటే సముద్రములో ఉన్నంత నీటితో వాటిని పోల్చవచ్చు" అని చెప్పాను. కానీ మన మెదడు పరిమితి కలిగినది, దానిని ఒక బక్కెట్ తో గనుక పోలిస్తే సముద్రం అంతా బక్కెట్ లో పట్టడం అసాధ్యం. ఆవిధంగానే దేవునిని గూర్చి పూర్తిగా తెలుసుకోవడం అసంభవం. ఆ మాటకు వస్తే మనలాంటి వేరొక మనిషినే మనం పూర్తిగా తెలుసుకోలేం.  కాబట్టి దేవునిని గూర్చి అంతా తెలుసుకున్నాక అయనను నమ్ముకోవడం అనేది జరిగేపని కాదు అని చెప్పాను. అంతేకాదు ఆయనను గూర్చి మనకు తెలుపబడిన కొద్దివిషయాలు నమ్మదగినవిగా ఉంటే ఆయనను మనం పూర్తిగా విశ్వసించడం సమంజసమైనది అని తెలియపరచినప్పుడు ఆయన నిజమే అని ఒప్పుకున్నాడు.

          ప్రియమైన దేవునిబిడ్డా నీవు లోకంలో నమ్మే ఎన్నోవిషయాలు నీవు పూర్తిగా పరీక్షచేయకుండానే నమ్ముతున్నావు. నీ స్నేహితులను, నీ బంధువులను ఇంకా అనేకమందిని కొంత పరిచయంతోనే నీవు నమ్మగలుగుతున్నావు. ఒక వ్యక్తిని ఈ లోకంలో నమ్మడానికి మనకు అతనిని గూర్చి పూర్తిగా తెలియనవసరం లేదు. మనం నమ్మడానికి సరిపోయేంతవరకు అతనిని గురించి తెలుసుకుంటే చాలు, అతన్ని నమ్ముతాము. అయితే దేవుని యొద్దకు వచ్చేటప్పటికి ఆయనను నమ్మటానికి ఎన్నోవిషయాలు ఆయన బయలు పరచినప్పటికీ మనం ఆయనను నమ్మడానికి వెనుకడుగు వేస్తూవుంటాము. ఒక్కసారి మనం దేవునినిగూర్చి నమ్మడానికి ఆయన మనకు ఏమి ఆధారాలు కలుగజేస్తాడో క్లుప్తంగా పరిశీలిద్దాం.

1. సృష్టి : మన నిజజీవితంలో ఒక అందమైన చిత్రపటాన్నో లేక వస్తువునో చూచినపుడు దానిని చిత్రీకరించినవాడు ఎవరో లేక ఆ వస్తువును తయారుచేసినవారు ఎవరో, ఎంత అద్భుతంగా తయారుచేసారో అని అనడం అందరికీ సహజం. కానీ ఈ గొప్ప నక్షత్రాలను, ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, జంతువులను, పక్షులను, మనుషులను మరింకెన్నో క్లిష్టమైన వాటిని చూచినప్పుడు వీటిని చేసిన వారు ఎవరో? ఎంతగొప్పవాడో? ఎంత శక్తిమంతుడో అని ఆలోచించకుండా కొంతమంది దేవునిని తెలుసుకోవడానికి ఇష్టపడరు. బైబిలులో " ఆకాశము ఆయన మహిమను, అంతరిక్షము ఆయన చేతిపనిని వివరించుచున్నవి" అని కీర్తనలల గ్రంధంలో వ్రాయబడియున్నది.

2. బైబిలు : ప్రియమైన దేవుని బిడ్డా బైబిలు గ్రంధం కొన్ని వేల సంవత్సరాల పురాతనమైనదని నీవు ఎప్పుడన్నా ఆలోచించావా? అటువంటి మరొక గ్రంధం ఏదీ లేదని నీకు తెలుసా? ఆ గ్రంధం తెలియపరచే గొప్ప గొప్ప సత్యాలను గూర్చి నీవు ఎప్పుడన్నా ఆలోచించావా? బైబిలు పరీక్షించబడినట్లు మరి ఏ ఇతరగ్రంధం కూడా పరీక్షించబడలేదు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే పుస్తకాలలో బైబిలుదే ప్రధమస్థానం. మొట్టమొదటిగా చంద్రమండలం మీదికి మానవుడు వెళ్ళినపుడు అక్కడ చదువబడిన మొదటి పుస్తకం బైబిలు. మూడు ఖండాలలో1500 సంవత్సరాల కాలంలో దాదాపు 40 మంది విభిన్న వ్యక్తులద్వారా 3 భాషల్లో66 పుస్తకాలు కలిగినదిగా బైబిలు వ్రాయబడింది. బైబిలులో చెప్పబడిన సత్యాలు మరింకెక్కడా చెప్పబడలేదు. బైబిలు అబద్దం అని నిరూపించడానికి దానిని చదివిన అనేకమంది బైబిలు సత్యం అని కనుగొని మారిపోయి యేసుప్రభువును నమ్ముకున్నవారు అనేకమంది ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిలును గూర్చి ఎన్నో విషయాలు మనం చెప్పుకోవచ్చు. కానీ మొట్టమొదట మనం యేసుప్రభువును గూర్చి తెలుసుకొని ఆయనను విశ్వసించినట్లయితే మనకు దేవుడు ఆయన ఆత్మద్వారా బైబిలులోని అనేక సత్యాలను విశదపరుస్తాడు. దేవుడు మనలను రక్షించడానికి ఈ లోకంలో మానవుడుగా అవతరించినట్లు బైబిలు తెలియపరుస్తుంది. చరిత్రలో 2000 సంవత్సరాల క్రితం ఆయన మన కొరకు జన్మించడం చరిత్రలో చూడగలం. చరిత్ర ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది. బైబిలు ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది. ఆయనను నమ్మినవారికి ఆయనచేసే అద్భుత కార్యములు ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మరియు ఆయనే సత్యము అని పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యమిచ్చుచున్నాడు.

           ప్రియమైన దేవుని బిడ్డా నీకు నీవుగా ఈ సృష్టిలో జన్మించలేదు. ఈ సృష్టిని కలుగజేసినవాడు, నిన్ను నన్ను సృజించినవాడు ఆయనే. మనలను రక్షించడానికి మానవుడుగా అవతరించి, పాపం లేని వాడుగా జీవించి సిలువలో రక్తం కార్చినవాడు ఆయనే. మనకు మరణంపై జయం ఇవ్వడానికి, మరణాన్ని జయించి 3 వ దినాన్న సమాధిలోనుండి లేచినవాడు ఆయనే. చరిత్రలో ఎవరూకూడా యేసుక్రీస్తు ప్రభువును పోలినవారు లేరు. ఆయన కన్య గర్భమున జన్మించిన ఒకే ఒక వ్యక్తి. పాపం చేయకుండా జీవించిన ఒకే ఒక వ్యక్తి. మనుష్యులను పాపంనుండి, మరణం నుండి రక్షించడానికి సిలువలో మరణించిన ఒకే ఒక దైవమానవుడు. తనను నమ్మిన వారి కొరకు త్వరలో రానైయున్న ఒకే ఒక దేవుడు. ఇటువంటి మరొకవ్యక్తి చరిత్రలో మరెక్కడా లేడు.

           ప్రియమైన దేవుని బిడ్డా, నీ మనస్సులో ఆయన ఆత్మద్వారా పైన చెప్పబడిన విషయాలు సత్యాలు అని నీకు బయలు పరచినట్లయితే, ఆయనను నమ్ముకోవడానికి ఆలస్యం చేయవద్దు. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. నీవు రక్షించ బడాలని తన ప్రాణాన్ని ధారపోసాడు. నిన్ను పాపవిముక్తుడిగా, మరణవిముక్తుడిగా చేయడానికి మరణాన్ని జయించి సజీవుడుగా ఉన్న దేవుడు. ఆయనను వెంటనే నీ హృదయంలోనికి రమ్మని విశ్వాసంతో వేడుకో. ఆయన్ను నీ పాపాలను క్షమించమని వేడుకో. ఆయన నిన్ను తన ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించుచున్నాడు గనుక నిన్ను తన రక్తంలో కడిగి తన బిడ్డగా అంగీకరిస్తాడు. దేవుని కృప మీకు తోడైయుండును గాక.

                                                                        Home

29 July 2004     5 Aug 2004    12 Aug 2004    19 Aug 2004    23 Sep 2004   14 Oct 2004

 

21 Oct 2004     11 Nov 2004